Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page

కర్మ యోగము

ఇది వసంతఋతువు. వైశాఖ మాసం ఋతువులన్నిటిలోనూ విశిష్టమైనది వసంతం. మల్లెలూ, మామిళ్ళూ ఈ ఋతువులోనే సమృద్ధిగా వస్తాయి. పుష్పం అంటే మల్లెనే చెప్పాలి. పండు అంటే మామిడిపండే, ఈ రెండూ వసంతంలోనే లభిస్తవి. ఇతర ఫలపుష్పాలు అన్నికాలాలలోనూ లభించవచ్చును. కాని ఈ రెండు మాత్రం వసంతంలోనే దొరుకుతవి. ఈ ఋతువులో పుట్టిన కొందరు మహనీయులు కూడ తమ జీవిత కుసుమాలను వికసింపచేసుకొని, రసాలను బోలిన తమ అమృతోపదేశములతో మానవకల్యాణాన్ని సంధానించారు.

ఆది శంకరులు వైశాఖశుద్ధ పంచమినాడు అవతరించారు. అద్వైత ప్రచారంచేశారు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించేందుకు స్తంభంనుంచి, నరిసింహుడు ఆవిర్భవించిందీ. ఈ మాసములోనే. వైష్ణవభక్తిని బాగా వ్యాపింపచేసిన రామానుజులవారూ ఈ నెలలోనే జన్మించారు. అక్షయ తృతీయ అనే పండుగా వైశాఖంలోనే వస్తుంది. భారతదేశంలో ఈనాడు లేకపోయినా, ప్రపంచంలో అనేక దేశాలలో వ్యాపించిన బౌద్ధమతస్థాపకుడు, గౌతమబుద్ధుడూ వైశాఖలోనే జన్మించాడు. ఈ విధంగా విశిష్టతను పుణికిపుచ్చుకొన్నది వైశాఖమాసం. వసంతం, మల్లెలూ, మామిళ్ళనేకాదు. మహానుభావులను కూడా సృష్టించింది.

( 9 - 9 )

ఇంతకూ భగవత్పాదులవారు చేసిన మహత్కార్యమేమిటి?

గోడలమీద రంగుబొమ్మలను వేసే ఆచారం మనదేశంలో ఉంది. మొదటవేసిన చిత్రాలు కొన్నాళ్ళయ్యాక శిధిలమౌతాయి. అపుడు వానిని సంరక్షించేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇంకా కొన్నాళ్ళకు అవికూడా పాడైపోతాయి. ఆ చిత్రాలు ఎందుకు ఉపయోగం లేకుండా వుంటవి. అపుడు ఆ చిత్రాలన్నిటినీ చెరిపి తెల్లగా సున్నం వేస్తాం. దానిమీద మళ్ళా క్రొత్తగా చిత్రాలు గీస్తారు. కొన్ని వందల ఏళ్ళుగా మనదేశంలోనూ ఇదేవిధంగా జరిగింది. సనాతనంగా వస్తూవున్న మన ధర్మం, సంస్కృతీ చిత్రం కాలాంతరాన కొంత చెరిగింది. జ్ఞానకర్మ సమన్వయం లోపించి కర్మకాండకే ప్రాధాన్యం వచ్చింది అట్లా కొంతకాలం గడచింది. అంతట కర్మయొక్క ఉద్దేశాన్ని లక్ష్యాన్నీ విస్మరించి ప్రతివ్యక్తీ తనకు యోగ్యత ఉన్నా లేకపోయినా, యజ్ఞయాగాదులు చేయడం ప్రారంభించాడు. దాంతో సనాతనమతమనే చిత్రం బాగా పాడైపోయింది. అపుడు గౌతమబుద్ధుడు అవతరించి లక్ష్యభ్రష్టమైన కర్మకాండమీద ధ్వజ మెత్తి దానిని పూర్తిగా ఖండించినాడు. అంటే ఉన్న చిత్రం మీద పూర్తిగా సున్నంపూసి శూన్యం చేశారన్నమాట. అంటే క్రొత్తబొమ్మ బాగాగీయడానికి ఆయన భిత్తికను తయారు చేశారన్నమాట. ఈ విధంగా చూస్తే బౌద్ధులూ మన సంస్కృతికి దోహదం చేశారనే మనం బప్పుకోవాలి.

మన మతం బుద్ధుణ్ణి కూడా ఒక అవతారంగా స్వీకరించింది. జయదేవులవారు, గీతగోవిందంలో - ''నిందసి యజ్ఞవిధేః అహహ శ్రుతిజాతం, సదయ హృదయ దర్శిత పశుఘాతమ్‌'' - అంటూ గానం చేశారు. ఇకపోతే బౌద్ధులు తెల్లగా సున్నం వేసిపోయిన గోడమీద భగవత్పాదులవారు మనోజ్ఞమైన చిత్రం గీశారు. ఈ సాంస్కృతిక చిత్తరువు. కొంత కొంత మాసినట్లు కనిపించినా ఈ నాటికీ అలాగే వుంది. వారు బోధించిన వైదికమత ఉద్ధరణ కోసం, ఈనాడూ అనేక సంస్థలు ఉన్నవి. ధర్మబుద్ధిగల వ్యక్తులూ పరిశ్రమిస్తున్నారు. ఈ పరిరక్షణకార్యం నిర్విఘ్నంగా జరిగేటందుకు భగవత్పాదులు చక్కని వ్వవస్థ నేర్పాటు చేశారు. ఈ జయంతులన్నీ దీనికి సంబంధించినవే.

మహనీయుల స్వభావాన్ని వర్ణిస్తూ భగవత్పాదులు 'శాంతా మహాంతో నివసంతి సంతః, వసంతవల్లోకహితం చరంతః' అని వసంతఋతువుకు పోల్చి చెప్పితే, 'ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతీ, శంభోర్మూర్తిః చరతి భువనే శంకరాచార్యరూపా' అని శంకరవిజయాకర్త మాధవాచార్యులు తమ గురువులైన శంకరులను స్తుతించారు. 'చరతి' అంటే సాక్షాత్తు శంకరులే ఆచార్యులవారి రూపంలో భూమిమీద చరిస్తున్నారని వారన్నారు. ఇదే మాట తోటకాచార్యులవారు తమ అష్టకంలో స్వామిని కీర్తిస్తూ 'విచరంతి మహామహసశ్చలతః' అని అన్నారు.

మనలో కొందరు ఆచార్యులవారు జగన్మిథ్య అని బోధించారుకదా! అందువల్ల జగత్తులో అందరూ కర్మశూన్యులై సోమరిపోతులై ఏ పనీచేయరు అని అంటారు. ప్రపంచాన్ని సోమరిగా చేయటమే వారిలక్ష్యమై వుంటే, వారూ ఏ పనీ చేయకుండా ఏదో ఒక మూల కూర్చుని ఉండి వుండవలెకదా? పదహారేళ్ళలో భారతదేశమంతా తిరిగి గ్రంథాలు వ్రాయటం ఏ సోమరికి చేతనవుతుంది? మనదేశంలో ఎందరో భక్తులు, సాధువులు మతాచార్యులు పుట్టారు. ఇతర దేశములలో కూడా మహనీయులు పుట్టివున్నా, మనదేశంలో ఉన్నంత ఎక్కువ ఆ దేశాలలో లేరు ఇప్పటికీ మనదేశంలో మహనీయులు పుట్టుతూనే ఉన్నారు.

అరవిందయోగి ఇటీవలవరకూ పాంచేరిలో ఉండేవారు. మీకు తెలిసే ఉంటుంది. వారికీ ఒక యోగం, దర్శనం అంటూ ఉంది. అందులో కర్మకే ప్రాధాన్యం. అయితే ఆ అరవిందులు తమసిద్ధాంతాల ప్రచారం అక్కడ అంటే పుదుచ్చేరిలో ఉంటూనే చేసేవారు. ఆ ఊరుదాటి బయటకు రాలేదు. ఆ ఊళ్ళో ఉన్నప్పుడు కూడా రోజూ తన శిష్యులకు కనబడి బోధచేసే వారుకాదట. 'అమ్మ' అనే ఆమెతో ఉండి, ఎపుడో సంవత్సరానికి ఒకమారు ఒక్కరోజు మాత్రం భక్తులకు దర్శనమిచ్చేవారట. సోమరితనం లేకుండా కర్మకు ప్రాధాన్యం ఇచ్చి కర్మచేయాలి. అనే సిద్ధాంతం చెప్పినవారు ఒకేచోట కదలకుండా కూచున్నారు. పోతే ఈ జగత్తంతా మిధ్య అని బోధించిన శంకరులేమో, నిలిచినచోట నిలువక, దేశమంతా తిరిగి జ్ఞానోపదేశం చేయటం ఆశ్చర్యకరంగా లేదూ?

ఐతే శంకరులవారు చేసిన జ్ఞానస్వరూపం ఏలాంటిది? అది పలాయన వాదమా?

వారిబోధలు, మనమన కర్తవ్యాలనూ, విధ్యుక్తధర్మాలనూ వదిలిపెట్టమని చెప్పదు. కర్తవ్యం నెరవేరుస్తూనే ముక్తి పొందే మార్గం సూచిస్తుంది. మనలో నవరసాలున్నాయి. ఇవి సాహిత్యశాస్త్రానికి సంబంధించినవి. శృంగార, హాస్య, వీర, కరుణ, రౌద్ర, భయానక, భీభత్స, శాంతములని, మానవులలో ఉన్న కొన్నిస్థాయీ భావములనుబట్టి ఇవి కలుగుతున్నవి. అట్లాగే ఇంకోవిధమైన ఆరు రుచులు, వగరు, చేదు, తిపి, కారం, ఉప్పు, పులుపు అనేవి ఉన్నాయి. ఈలాగే కామ, క్రోధ లోభ, మోహ మద, మాత్సర్యములనే ప్రవృత్తులూ ఉన్నాయి. ఇవన్నీ భగవంతుడు ఎందుకు కల్పించాడు? అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు.

ఔను; ఇవి ఏవీ లేకపోతే జీవితం ఒడిదుడుకులు లేకుండా శాంతంగా గడచిపోతుందికదా? ఇవన్నీ పెట్టడంలో ఆయన ఉద్దేశ##మేమి? అంటూ పరమేశ్వరుని వివేకమునే ప్రశ్నిస్తూ ఉంటారు? ఏమో! ఆయన ఈ గుణాలను ఎందుకు సృష్టించాడో ఎవరికి తెలుసు! కానీ, దీర్ఘంగా ఆలోచిస్తే కొన్ని విషయాలు మనకు గోచరిస్తాయి. ఒకవేళ కామం లేదనుకొందాం. అప్పుడు సృష్టికార్యమే నిలిచిపోతుందికదా! సృష్టిలేకపోతే మనమంటూ ఉండము కనుక కామం అవసరం. కామం అంటే కోరికలు ఉన్నపుడు వానిని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దానితో సంఘరణలు, ద్వేషాలు అనివార్యమౌతాయి. కనుక భగవంతుని వివేకాన్ని ప్రశ్నించడంలో అర్థంలేదు. ఇవి అన్నీ ఉండాల్సినవే. ఇవన్నీ బంధనములే. వీనిలోఉంటూనే వీని నుంచి మనం ముక్తి సంపాదించుకోవాలి. అదే మానవ జీవితానికి లక్ష్యం.

మానవుని జీవితం ఒక చెట్టులాంటిది. చెట్టును అరవంలో 'మరం' అంటారు. అంటే అది స్థిరంగా ఉండనిది. నశించేది. అమరం కానిది మరం. ఈ చెట్టునే తీసుకొంటే, అందులో అన్నిరుచులు - ఉప్పు, పులుపు, వగరు, కారం, తీసి, చేదు, అన్నీ ఏదో ఒక భాగంలో ఉంటాయి. మొలక ఎత్తినప్పటి నుండీ పండు పండేంతవరకు ఈ రుచులన్నీ మనకు చెట్టులో కనిపిస్తాయి. చివరిదశలో, అనగా పండులోతీపి మాధుర్యం వుంటవి. సహజంగా చేదుగా ఉన్న వేపచెట్టు అయినాసరే దానికి కాయలుకాచి, పండేసరికి వాటిలోకూడా ఒకవిధమయిన అవ్యక్త మాధుర్యం రానేవస్తుంది. పండినతర్వాత వేపకాయ తనంతటతానే ఊడి క్రిందపడుతుంది. అంటే ఈ రుచులన్నిటికీ పై మెట్టు తీపి అన్నమాట.

అన్నిరుచులు క్రమంగా మధుంలో అంతర్భావమౌతాయి. ఇదే సిద్ధాంతం శాశ్వతంకాని ప్రతివస్తువుకూ మానవునికీ వర్తిస్తుంది. పోతే సాహిత్యానికి సంబంధించిన నవరసాలనూ మానవుని జీవితంలో సమన్వయం చేసినపుడు చివరకుమిగిలేది, మిగులవలసినదీ శాంతమే. అందులోనే మాధుర్యం ఉంటుంది. ఆనందం ఉంటుంది. సుఖం ఉంటుంది. ఈర్యాద్వేషాలు, కామక్రోధాలు జీవితంలో పై మెట్టుకు పోయే కొద్దీ తగ్గిపోయి శాంతంలో పర్యవసించాలి. ''శాంతము లేక సౌఖ్యములేదు'' అని త్యాగరాజులవారనటంలో ఇదే తాత్పర్యం. ఆ శాంతంలో తీపి, ఆనందం ఉన్నవి. ఆ ఆనందమే పరబ్రహ్మస్వరూపం. బ్రహ్మ, పరమేశ్వరుడూ ఒక్కడే. ''ఏకం సత్‌ విప్రాః బహుధా వదంతి' ఆ పరతత్త్వస్వపూరమే ఆనందం, రసం, 'రసోవైనః'

అక్కడ అన్ని వైవిధ్యాలూ, ద్వైతభావాలూ సమసిపోయి ఒకే ఒక భావం నిలిచిపోతుంది. దాన్నే మోక్షం అని కూడా అనవచ్చు. మోక్షం అంటే బంధవిమోచనం. ఏలాంటి బంధములనుంచీ విముక్తి? కొంతమంది చనిపోయిన పిదప మోక్షం పొందుతారని అంటారు. అది సరికాదు. నిజమైన మోక్షం జీవించి ఉండగానే, శరీరం ఉండగానే పొందగలం.

పై చెప్పిన పండు ఉపమానం తీసుకొంటే చెట్టు ఉండనిదే, పండుపండి తనంతట తాను రాలి క్రిందపడలేదుకదా! చెట్టే లేనప్పుడు పండూలేదూ, పండటమూ లేదు; విడిపోవటమూ లేదు. అలాగే శరీరమంటూ ఉన్నపుడే మోక్షాన్నీ, ముక్తిని పొందగలం. మృత్యువు ప్రాణుల కందరికి సహజలక్షణం. దానికీ మోక్షానికీ సంబంధంలేదు. మరణించిన వారందరూ మోక్షం పొందరు. శరీరం నంచీ ముక్తి మోక్షంకాదు. పై చెప్పిన పండునే తీసుకొందాం. అది మొగ్గగానూ, పువ్వుగానూ, కాయగానూ, ఉన్నంతవరకూ చెట్టును అంటిపెట్టుకొనే వుండినది. దానిని బలవంతంగా గిల్లితే పాలుకారుతుంది. శరీరం నుంచి అంగాన్ని వేరుచేస్తే రక్తం కారినట్లు. అది కాయకు క్లేశ##హేతువు. సుఖం కలిగించదు. అలాకాక అది బాగాపండగానే, అంతకు ముందున్న వగరు, పులుపు, చేదు మొదలైన రుచులను వదలిపెట్టి అధిగమించి తీపిని పొందినపుడు, అనగా మగ్గపండినపుడు, దానంతట అదే చెట్టునుంచి విముక్త మవుతుంది. అపుడు పాలూకారవు, దానికి బాధావుండదు. మానవుని విషయమూ అంతే.

కామ, క్రోధ, లోభ, మోహాది వాసనలలో, వివిధ రసాలలో లీనమై ఉన్నంతవరకు, అతనికి ముక్తి అంటూ వుండదు. ఆ దశలన్నీ సహజంగా గడచి, వైరాగ్యాన్ని వరించినపుడు సంసారంతో గల సంబంధాలన్నీ బలవంతంగా కాక, సహజపరిణామంగానే తొలగద్రోసుకొనినపుడు, అతని చిత్తానికి ఒక ప్రశాంతత, ఆ ప్రశాంతత్వంలో ఒక సౌఖ్యమూ, మాధుర్యము అనుభవానికి వస్తాయి. అపుడు అతడు ముక్తుడౌతాడు. జీవించి ఉండగానే ముక్తుడై, జీవస్ముక్తుడౌతాడు. జనమంతా జీవన్ముక్తులు కాలేరు. నూటికీ, కోటికీ, ఒక్కడు జీవన్ముక్తుడైనా చాలు. ''మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్‌ యతతి సిద్ధయే'' - యతతామిపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః'' ఎవడో ఒక మహానుభావుడు ముక్తుడైనా' అతడు ఎందరికో తరుణోపాయం చూపగలుగుతాడు.

( 9 - 10)

మృత్యుంజయ మంత్రంలో దోసపండు ఉపమానం ఇవ్వబడింది. 'ఉర్వారుక మివ బంధనా స్మృత్యో ర్ముక్షీయ-' ఉర్వారుకం అంటే దోసకాయ. బాగా పండినపుడు తీగతో దానికి ఏమాత్రమూ పట్టులేనపుడు (అంటే తీగను అంటిపెట్టుకొనని స్థితి అన్నమాట) దానంతట అదే తీగనుండి విడిపోతుంది.

చెట్లలో పండే ఫలాలవలె క్రింద బడటమంటూ ఉండదు. నేలపై ప్రాకె తీగకనుక అది తీగనుంచి విడివిడి ఉన్నచోటనే ఉండిపోతుంది. అపుడు దానికీ, తీగకూ, తనకూ అన్నాళ్లుగా ఉండిన సంబంధజ్ఞానమే వుండదు. అది సంపూర్ణ పరిపక్వదశ. బంధమోచనం అనిపించుకొంటుంది. కనుకనే దోసకాయ ఉపమానమే అన్నివిధాల తగినది. సౌందర్యలహరిలో భగవత్పాదులు ఒక శ్లోకం చెప్పారు.

సరస్వత్యాలక్ష్మ్యా విధిహరిసపత్నో నిహరతే

రతేః పాతివ్రత్యం శిధిలయతి రమ్యేణ వపుషా!

చిరంజీవ న్నేవ క్షపిత పశుపాశ వ్యతికరః

పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్‌ ||

ఇందులో పరమేశ్వరుని ఉపాసించే భక్తునికి కలిగే మహాభాగ్యం వర్ణించబడింది. తల్లిదయకు పాత్రుడైనవాడు. లక్ష్మి సరస్వతులనువశం చుసుకొని, విష్ణు బ్రహ్మలకోపానికి కారణమౌతాడట. తన రూప సౌందర్యంతో రతీదేవి పాతివ్రత్యాన్నే భంగింపచేస్తాడట. మన్మథుణ్ణి కూడా మించిన అందగాడు ఔతాడట. అంతేకా - 'చిరంజీవ న్నేవ' చిరకాలం జీవించి ఉంటూ, 'క్షపిత పశుపాశవ్యతికరః' జీవుడు, అవిద్య అనే బంధాలనుంచీ బయటపడతాడట. అంటే జీవన్ముక్తుడౌతాడన్నమాట. అంతట అతనికి బ్రహ్మనందమనే మహారసం లభిస్తుంది. అతడు శివస్వరూపుడే ఔతాడు.

పశుపతిమతం అని మనలో ఒకటుంది. అందులో మూడు ముఖ్యవిషయాలుంటాయి. పశువు, పతి, పాశము. ఒక పశువు అని ఉంటే దానికి అధిపతి ఒకడుంటాడు. అతడాపశువును పాశంతో - పలుపుతో కట్టివేస్తాడు. ఇష్టంవచ్చినట్లు తిరగ నీయడు. తిరగనిస్తే, ఆ పశువు పైరుచేలలో మేతమేసి, పైరుకు నష్టం కలిగించి తానూ దెబ్బలుతిని, ఇంటికి తిరిగి వస్తుంది. పాశబంధం లేకపోవడం పశువుకూ ఇతరులకూ బాధాకరమే, అలాగే జీవులనే పశువులను పరమేశ్వరుడు తన అదుపులో ఆవిద్య అనే పాశంతో కట్టివేసి ఉంచుతాడు. వానిలో కొన్ని పశువులు మంచివి ఉంటాయి. అవి చేలలోపడి మేయవు. ఇతరులకు హాని కలిగించవు. తామూ దెబ్బలు తినవు. అటువంటి మంచిపశువులును చూచి యజమాని సంతోషిస్తాడు. వానిని పలువులతో కట్టడు. పాశం తొలగిస్తాడు. కొన్ని పశువులు కొన్నాళ్ళు దెబ్బలు తినిన మీదట బుద్ధి తెచ్చుకొని చక్కగా నడుచుకొంటాయి. యజమాని వాని నడవడిని పరిశీలించి బాగా నమ్మకం కలిగిన పిదప వానికట్లను విప్పుతాడు.

అలాగే పశుపతి అంటే పరమేశ్వరుడు కూడా సహజంగా జ్ఞానులైనవారిని బంధించడు. వారికి స్వేచ్ఛ, ముక్తీ ప్రసాదిస్తాడు. వారు ముక్తసంగులు. అటువంటివారు కామక్రోధాదులకు లోనుగారు. స్వపర భేదాలకు, ద్వంద్వములకూ వారు అతీతులు. ప్రపంచంలో నిండివున్నదంతా ఒక్క పదార్థ మని వారిభావం. బాహిరంగా కనుపించే వైవిధ్యమూ, వస్తుజాలమూ, ఘట జలాదులలో కనిపించే సూర్యుని ప్రతిబింబమువలె, రజ్జుసర్పభ్రాంతివలె, స్వప్నగత దృశ్యములవలె మిథ్య అనే అనుభూతిని వారు పొందుతారు.

రజ్జు సర్పభ్రాంతిలో, రజ్జువు సర్పము కాకపోయినా ఆ భ్రమకు ఆధారమయినది. చివరకు రజ్జువే మిగులుతుంది. సర్పము భ్రమ, రజ్జు సత్యము. అలాగే స్వప్నములో వివిధానుభూతులను పొందుతున్నాం. మెలకువరాగానే నశించిపోతుంది. స్వప్నాన్నీ, స్వప్నగత మిథ్యాత్వాన్నీ దర్శించే జ్ఞానమే శాశ్వతం, అదే బ్రహ్మ. జాగృతిలో ప్రపంచం అంతా సత్యమైనట్లు కనుపిస్తుంది. సుషుప్తిలో అది పూర్తిగా లేని దౌతుంది. ఏ జ్ఞానమూ ఉండదు. ఈ రెంటికి మధ్యదైన స్వప్నావస్థలో జగత్తు ఉన్నట్లు అనిపించి మెలకువలరాగానే అది అసత్యమని తెలుస్తుంది. నిజమైనట్లు కనిపించే జగత్తుయొక్క మిథ్యాత్వం స్వప్నం వల్ల మనస్సుకు బాగా హత్తుకొంటుంది. అర్థమౌతుంది. ప్రపంచం యొక్క మిథ్యాత్వాన్ని చక్కగా బోధించడానికే భగవంతుడు స్వప్నావస్థను కల్పించాడు. జాగృతి, సుషుప్తుల నడుమ నున్న స్వప్నావస్థ ఈ విధంగా మనకు తత్త్వజ్ఞానోదయం కలిగించుటలో తోడ్పడుతున్నది. స్వప్నం మనకు మహోపకారి. అది జీవికి తన నిజస్థితిని గుర్తు చేయుటలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.

జీవన్ముక్తుడెలా వుంటాడు? వాని లక్షణమేమి? మూకపంచశతిలో ఒక శ్లోకం ఉన్నది.

శివ శివ పశ్యంతి సమం

శ్రీ కామాక్షి కటాక్షితాః పురషాః|

విపినం, భవనం మిత్ర మమిత్రం

లోష్టం చ యువతి బింబోష్టమ్‌||

అంటే భగవతి కామాక్షి కటాక్షం పొందిన భాగ్యశాలి అడవినీ, సౌధాన్నీ, మిత్రునీ, శత్రువునూ ఇనుపముక్కనూ యువతి బింబాధరాన్నీ ఏ విధమైన మానసిక వికారాలకు లోనుగాక ఒక్క విధంగా చూడగలుగుతాడట. అతనికి స్వపర బేధముండదు. సుఖదుఃఖములకు అతడు అతీతుడుగా వుంటాడు. నిజానికి అతనికి ఏ విధమైన భావమూ ఉండదు. ప్రపంచమంతా తానే ఐనపుడు, భావించటం, భావన, భావించే వాడు అనే విషయాలకే తావుండదు. ఇది జీవన్ముక్తుని లక్షణం. అది పరమేశ్వరియొక్క అనుగ్రహం. ఈ దివ్యానుభూతిని, ఈ ఆనందరసస్థితిని ప్రపంచానికి అందించడానికే అహర్నిశలూ దేశాటనంచేసి తమ జీవితాన్ని లోకకల్యాణార్థం ధారపోశారు. వారు కావించిన పర్యటన ఆవశ్యకత, ఔచిత్యమూ అదే. వారు లోక కల్యాణ సంధాయుకులైన మహానుభావులను గురించి చెప్పిన శ్లోకానికి కొద్ది మార్పుచేస్తే అది వారికి అన్వయించినంత మరొకరికి అన్వయించదు.

శాంతో మహాంతో నివసంతి సంతః,

వసంత వల్లో కహితం చరంతః.

ఇందులో 'నివసంతి' కి బదులు 'విచరంతి' అని ఉన్నచో భగవత్పాదుల పట్ల చరితార్థ మౌతుంది. వారు ఒకచోట కూర్చుని ఉండలేదు. జీవితాంతమూ దేశపు మూలమూలలా తిరిగి మానవాళినీ, సముద్ధరించిన కరుణామూర్తులు. మరణాసన్నమయిన మానవాళినీ, సనాతన వైదిక ధర్మాన్ని వసంత ఋతువులాగా కొంగ్రొత్త జీవముపోసి, చిరస్థాయిగా నిలబెట్టిన లోకశంకరులువారు. శంకరాచార్యులంటూ ఒకరు ఉండబట్టే. నేడు మనమతం, ధర్మం నిలిచి ఉన్నాయి. భగవత్పాదులపేరే ధర్మసంస్థాపనానికి ఈనాడు పర్యాయపదమైపోయింది, శంకరాచార్యులు అన్న పేరువల్లనే మాకేమైనా విలువవుంటే వుంటుంది. ఆ పేరు లేకపోతే మేమూలేము, మీరూ లేరు.


Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page